నాన్న

                      -- మంజువాణి కొండపి

 

 

అనురాగాలు అనుబంధాలు

విరిసిన ఆనంద సంసారానికి సారధి నాన్న

అవధులు లేని ఆకాశమంత ఓర్పుతో

అలుపెరగని అనంతమైన మమతతో

ఇంటి భారాన్ని మోసే ప్రేమ పెన్నిధి నాన్న

 

ప్రపంచాన్ని పరిచయం చేస్తూ

మంచి చెడూ భేదం వివరిస్తూ

న్యాయం ధర్మం మార్గం చూపిస్తూ

ఉత్తమ నడవడికను సూచిస్తూ

పిల్లలను తీర్చిదిద్దే ఆదర్శమూర్తి నాన్న

 

నీతి నిజాయితిని పెంపొందిస్తూ

ఆశ ఆశయాలకు ఊపిర్నిస్తూ

మార్పు చేర్పులకు చేయూతనిస్తూ

విజయానికి సంతోషంగా పండగ చేస్తూ

పిల్లలకు అండగా ఉండే శాంతమూర్తి నాన్న

 

అభివృద్ధిని అభినందిస్తూ

అభిరుచులను ప్రోత్సహిస్తూ

అభిప్రాయానికి  గౌరవమిస్తూ

అభ్యుదయాన్ని ఆహ్వానిస్తూ

పిల్లల వెంట వుండే నిర్మలమూర్తి నాన్న

 

రేపటి కోసం ఆరాట పడుతూ

ప్రగతి పథానికి బాటను వేస్తూ

ఓటమి భాధకు ఊరటనిస్తూ

మంచి భవిష్యత్తుకు బాసట ఔతూ

పిల్లలకై చెమటోడ్చి పనిచేసే త్యాగమూర్తి నాన్న

 

ఆర్థిక కష్ట నష్టాలను తట్టుకుంటూ

జీవిత ఒడిదుడుకులను దాటుకుంటూ

కలిమి లేములను ఎదుర్కుంటూ

ఆటు పోటుల కడలి కుటుంబంలో

జీవితనౌకను నడిపే నావికుడు నాన్న

 

పండంటి కుటుంబానికి నాయకుడు నాన్న

మధురమైన బ్రతుకుపాట గాయకుడు నాన్న

అలసట చెందక కృషించే శ్రామికుడు నాన్న

బాగుకై బంగారు కలలు కనే భావికుడు నాన్న

పిల్లలకు స్థైర్యాన్ని ఇచ్చే మనోనిబ్బరుడు నాన్న

 

సంస్కారం మమకారం ఆప్యాయత ఆపేక్ష

ధ్యేయం ధైర్యం గాంభీర్యం ఔదార్యం

కలబోసిన దైవాంశ సంభూతుడు నాన్న

సుగుణాలన్నీ పేర్చి మలచిన సౌజన్యుడు నాన్న

పిల్లలను కాచి పాలించే మహోన్నత వ్యక్తి నాన్న

వారికై ఇలలో వెలసిన దేముడి ప్రతిరూపం నాన్న